న్యూఢిల్లీ/రాంచి: మరణించిన జవాన్ల కడుపుల్లో మావోయిస్టులు బాంబులు అమర్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని లాతెహార్ జిల్లాలో ఈనెల 7న మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో పదిమంది జవాన్లు మరణించారు. కానీ, ఆరుగురి మృతదేహాలే లభించాయి. మిగిలిన నలుగురి కోసం గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టారు. ఆ నాలుగూ బుధవారం సాయంత్రం కనిపించాయి. వాటిని రాంచీకి తరలిస్తుండగా ఒక మృతదేహంలో అమర్చిన బాంబు పేలింది. దాంతో, అక్కడే ఉన్న నలుగురు గ్రామస్తులు మరణించారు. మిగిలిన మూడు మృతదేహాలను హెలికాప్టర్లో రాంచీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో అలహాబాద్‌కు చెందిన బాబూలాల్ పటేల్ (29) పొట్ట ఉబ్బెత్తుగా ఉంది. దానిపై కుట్లు ఉన్నాయి. వాటిని చూసిన డాక్టర్లకు అనుమానం వచ్చింది. మృతదేహాన్ని ఆరుబయట ఉంచి ఎక్స్‌రే తీశారు. ఏదో లోహపు వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో అత్యాధునిక పేలుడు పదార్థాలు (ఐఈడీ). ఒక్కొక్కటి కిలోన్నర బరువు ఉంది. 
ఆ వెంటనే ఢిల్లీ నుంచి ఎన్ఎస్‌జీలోని బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. ఆ బృందం బాంబును నిర్వీర్యం చేసేసింది. "ఎన్‌కౌంటర్ తర్వాత మృతదేహాలను ఎత్తుకుపోయారు. వాటి పొట్టను చీల్చేశారు. అందులోని పేగులు, ప్లీహం తదితర అవయవాలను తీసి, పొట్టను పూర్తిగా ఖాళీ చేసేశారు. తర్వాత, ప్లాస్టిక్ బాక్సులో కిలోన్నర బరువుండే జిలెటిన్ స్టిక్కులు, డిటోనేటర్, ఒక బ్యాటరీని ఉంచి ప్యాక్ చేశారు. ఆ తర్వాత అత్యంత నేర్పరితనంతో కుట్లు కూడా వేసేశారు'' అని పోలీసులు, డాక్టర్లు వివరించారు. మావోయిస్టుల్లో ఎంతో నైపుణ్యం గల డాక్టర్ ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే జవాన్ల సహచరులు ఆస్పత్రికి దూసుకొచ్చారు. మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అయితే, కమాండర్లు వారిని సముదాయించారు. మావోయిస్టులు కొత్త కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. జార్ఖండ్‌లో మావోయిస్టు అగ్రనేతలు ఉండి ఉండవచ్చని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. గతంలో మృతదేహాల కింద బాంబులు పెట్టేవారని, వాటిని తరలిస్తున్న సమయంలో అవి పేలేవని, కానీ, మృతదేహాల పొట్టలు కోసి, వాటిలో బాంబులు ఉంచడం దేశంలో ఇదే తొలిసారని అన్నారు. 
మృతదేహాలను తీసుకొచ్చేటప్పుడు హెలికాప్టర్లో అది పేలకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని లాతెహార్ ఎస్పీ క్రాంతి కుమార్ చెప్పారు. ఎన్‌కౌంటర్లో మరణించిన నలుగురు గ్రామస్తుల కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి రూ.2.35 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామని క్రాంతికుమార్ ప్రకటించారు. సైనికుల పొట్టలను కోసి వాటిలో బాంబులు ఉంచడం పూర్తిగా అనాగరిక చర్యని,మానవ హక్కుల సంఘాలు ముందుకొచ్చి ఈ దుర్మార్గ ఘటనను ఖండించాలని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

-- 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®