చాలా బాగా చెప్పారు...మహేశ్వర్ గారు.

అందరికి జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు.

యువతకు భవితేదీ?

నేడు జాతీయ యువజన దినోత్సవం?! ఈ విషయం ఎంత మంది యువజనులకు తెలుసు? తెలిసినా వారిలో ఉత్సవాలు జరుపు కునే వారెందరు? అని ఆలోచిస్తే కొంత మంది రాజకీయ నాయకులు 'యువజన దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ తమ ఫొటోలు పెట్టుకుని వ్యక్తిగత ప్రచారం పెంచుకోవడానికి తప్ప నిజంగా యువజనులు అన్ని విధాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభ విస్తూ ఉత్సవాలు జరుపుకునేంత పరిస్థితి లేదు అనేది జగమెరిగిన సత్యం.

ఈ రోజుకు ఇంకో ప్రత్యేకత ఉంది. స్వామి వివేకానంద జయంతి రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. వివేకానందుడు బాల్యావస్థలోనే జాతీయతా భావాలను పెంపొందిం చుకున్నారు. యువకునిగా భారత జాతీయతను, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని అనేక దేశాల్లో సభలు నిర్వహించి చాటి చెప్పిన గొప్ప వక్త. విదేశీ తత్వవేత్తల మన్ననలందుకున్న మహనీయుడు.

మహనీయుల జయంతులు, వర్ధంతులు జరుపుకుంటున్నప్పుడు వారేం చేశారు? వారెంత గొప్పవారు అని సమీక్షించుకోవడం కంటే వారాశించిందేమిటి? వారున్నంత కాలం పోరాడి తర్వాత సమాజంపై అంటే మనకు అప్పగించిన కర్తవ్యమేమిటి? అని గుర్తించి ఆ కర్తవ్య సాధనకై పోరాడితే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. లేకుంటే వారి ఆశయాలకు అర్థం లేకుండా పోతుంది. నాడు పరదేశీయుల పాలనలో కొట్టుమిట్టాడిన భారత సమాజం నేడు స్వదేశీ పాలకుల కుట్ర, కుతంత్రాలలో నలిగిపోతోంది. సామ్రాజ్యవాదుల చేతుల్లో మాడిపోతోంది.

ప్రైవేటీకరణ-యువతపై ప్రభావం

1980వ దశకంలో రాజీవ్‌గాంధీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ఆర్థిక విధానాలకు ఆజ్యం పోశారు. వాటిని పివి నరసింహారావు సంపూర్ణంగా అమల్లోకి తేచ్చారు. ఆ విధానాలనే నేటి మన పాలకులు మరింత దుడుకుగా అమలు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ రుణాలు, అమెరికా సామ్రాజ్యవాదుల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆర్థిక వనరులన్నీ ప్రైవేట్‌ వారి హస్తగతమవుతున్నాయి. పాలకులు, పాలక పార్టీలూ (వామపక్షాలు మినహాయించి) బూర్జువా నియంతృత్వ శక్తులకు, సామ్రాజ్యవాద ఆంక్షలకు లొంగిపోతున్నాయి. జాతి సంపదను, సంస్కృతిని కొల్లగొట్టుతున్నాయి. అధికార గర్వంతో ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రశ్నించే ప్రజలను అణగ దొక్కుతున్నాయి. దీంతో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా యువకులతోపాటు అన్ని రంగాల ప్రజలూ దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ప్రపంచీకరణలో భాగంగా సరళీకరణ ఆర్థిక విధానాలతో నిరుద్యోగ సమస్య ఒక వైపు, అధిక ధరలు మరోవైపు సగటు మనిషి నడ్డి విరుస్తున్నాయి. దీంతో యువత పెడదారి పడుతోంది. తీవ్రవాదులుగానూ, ఉగ్రవాదులుగానూ, సంఘ వ్యతిరేక శక్తులుగానూ మారిపోతున్నారు. దొంగతనాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారు. అనేక దురలవాట్లు, దుర్వ్యసనాలకు గురవుతున్నారు. కుల, మత విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు పెచ్చరిల్లి పోతున్నాయి. కుటిల రాజకీయాలు యువతను క్షీణింపజేస్తున్నాయి. లింగ విద్వేష భావాలు సర్వసాధారణమవుతున్నాయి. వీటన్నింటినీ అరికట్టి సమాజ శ్రేయస్సును కాపాడవలసిన పాలక వర్గం చూసీ చూడనట్టు వ్యవహరించడం దాని నిర్లక్ష్యానికి, అసమర్థతకు అద్దం పడుతోంది.

గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత ఆధునికి టెక్నాలజీ ఆవిర్భవించడంతో అనేక కొత్త రంగాలు, వాటికనుగుణంగా వృత్తి విద్యా కోర్సులు ఉద్భవించాయి. ఈ పరిణామం యువతకు కొంతైనా చేరువవుతుంది, కొన్నయినా ఉద్యోగాలు పెరుగుతాయి అన్న ఆశ అనతి కాలంలోనే నిరాశను మిగిల్చింది. అది తాత్కాలిక 'బూమ్‌'గా మారింది. ఆ తరువాత లక్షలాది మంది యువత వీధులపాలయ్యారు. పారిశ్రామిక రంగంతోపాటు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి కావడం, అది కాస్తా ప్రైవేటు వారి చేతుల్లో చిక్కడంతో 90 శాతం ప్రజానీకానికి కనీస కూలి దొరకక దారిద్య్ర రేఖ దిగువకు చేరగా, 10 శాతం మంది మరింత సంపన్నులుగా మారారు. అదే సందర్భంలో ప్రసార మాద్యమాల టెక్నాలజీతో యువతతోపాటు పూర్తి సమాజాన్నే వినిమయదారీతత్వం వైపు మళ్ళిస్తోంది. మరో వైపు మహిళలకు డబ్బు ఎరజూపి అంగట్లో బొమ్మలుగా చిత్రీకరించి యువతను పెడదారి పట్టిస్తోంది. ఇటువంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న యువతరాన్ని ఒక సక్రమమైన గాడిలో పెట్టాలంటే ఉత్పత్తి రంగాల్లోకి వచ్చిన నూతన టెక్నాలజీని కార్మికులకు అందుబాటులోకి తేవాలి, ప్రైవేటు రంగంలోని సంస్థలను జాతీయం చేయాలి. వృత్తి విద్యా కోర్సులు అందరికీ అందుబాటులోకి తేవాలి. నిరుద్యోగ సమస్యను అరికట్టే విధంగా అర్హులైన వారందరికీ వృత్తి లోన్లు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే భారత సమాజం గొప్ప సమాజంగా, భారత సంస్కృతి గొప్ప సంస్కృతిగా వికసిస్తుంది, విరాజిల్లుతుంది. అలా జరిగినప్పుడే వివేకానందుని ఆశయాలు నెరవేరుతాయి. ఆయన శ్రమ ఫలిస్తుంది. ఆ దిశగా వామపక్షవాదులు, యువజన సంఘాలు, నిరుద్యోగులూ ఇప్పటికే పోరాడుతున్నారు. ఇటువంటి పోరాటాల్లో అందరూ కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.

(నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా) 

-దుర్గం మహేశ్వర్‌


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®