జనాభా నియంత్రణ
భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం.
జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు. పురాతన గ్రీస్ దేశంలో తమ అధిక జనాభా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని అధికారికంగా అమలు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి. ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉన్నది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన ఆన్స్‌లీ కోలే విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం.(3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన.
కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్ధిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు తగ్గుతాయన్న మాట వాస్తవం కాదు.
వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది. ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.@ భారతీయులం