నేను మెచ్చినది...!
ఎవరైనా సరే తమ సమయాన్ని ఎక్కువ ఉపయోగపడే విషయాలకు వినియోగించడం వివేకవంతమైన పని. అంటే చేసే పని ఎక్కువ మందికి ఎక్కువ కాలం ఉపయోగపడాలి. ఇది వాస్తవిక అంచనాలపై ఆధారపడి వుంటుంది. రాయిని పొదిగితే ఫలితం లేదని గుడ్డును పొదిగితేనే పిల్ల వస్తుందని తెలుసుకోవడం లాంటిదే ఇది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనము రంజింపలేము' అన్న పద్యంలో మాదిరిగా అనవసరమైన పనులలో శక్తి వృథా చేసుకోవడం గాక సత్ఫలితాలిచ్చే అంశాలను ఎంచుకోవాలి. గతం కన్నా భవిష్యత్తుకేసి చూడాలి. రాలిపోయే దానికన్నా చిగురించే దానిపై కృషి చేయాలి. ఏ ఒక్కరికో ఉపయోగపడే వాటికంటే పది మందికి పనికి వచ్చే అంశాలపై కష్టపడాలి. ఆలోచనలు ఘనీభవించిన వ్యక్తులతో గంటల తరబడి వాదించడం కంటే గ్రహణ శక్తి గల కొత్త శక్తులను ప్రోత్సహించడం మెరుగు. బలవంతుల చుట్టూ ప్రదక్షిణలు చేసే బదులు బలహీనులను బలోపేతం చేయడం మెరుగు. తెలిసిన వారికి మన తెలివిని చూపి మెప్పు పొందే బదులు తెలియని వారికి చెప్పడానికి శ్రద్ధ పెట్టడం మెరుగు.సరిగ్గా రాని దానికోసం అదే పనిగా సమయం వెచ్చించే బదులు వచ్చిన దాన్ని మెరుగు పెట్టుకోవడం మెరుగు. కేవలం విమర్శలకు గంటలు కేటాయించే బదులు మనంగా మెరుగుపర్చడానికి సమయం కేటాయించడం మెరుగు. అవసరమైన పనలు, ఆసక్తికరమైన పనులు చేయడం వల్ల సామర్థ్యం పెరగడమే గాక సమాజానికి కూడా మేలు కలుగుతుంది. సంతృప్తి కూడా మిగులుతుంది. ఫలితం లేని పనులు, పెద్ద ప్రాధాన్యం లేని వ్యవహారాలలో మునిగితేలితే వ్యక్తులకూ సమాజానికి కూడా నష్టమే. పొదుపు గురించి ప్రతి పైసా జాగ్రత్తగా వినియోగించడం గురించి చెబుతుంటారు గాని వాస్తవంలో ప్రతి నిముషం ఎలా వినియోగించుకోవాలన్నది మరింత కీలకం. ఎందుకంటే డబ్బు ఎలాగోలా సంపాదించుకోవచ్చునేమో గాని పోయిన సమయాన్ని తిరిగి పొందలేము. ఒక చిల్లిని మరమ్మతు చేయించే బదులు రోజూ అలాగే వాడుతుంటే సమయం శ్రమ కూడా దండగ. మీ సమయంపైన ఇతరులకు గౌరవం వుంటుందో లేదో గాని కనీసం మీకైనా వుండాలి. మీకు ఎంత గొప్ప ఆలోచనలున్నా వాటిని సకాలంలో సవ్యంగా అమలు చేస్తేనే ఫలితం. కనక సమయం మిగుల్చుకోవాలి.@ భారతీయులం 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®