ఫెయిలయినందుకు టీచర్లందరినీ నిర్భంధించిన XI క్లాస్ విద్యార్ధులు:
పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో క్లాస్ XI సంవత్సరాంత పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్ధులు టీచర్లందరినీ స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. తమని క్లాస్ XII కు ప్రమోట్ చేశామని చెబితే తప్ప విడుదల చేయబోమని పట్టుపట్టారు. దాదాపు తొంభై మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో ఉండడంతో జోక్యం చేసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారు. స్కూల్ సెక్రటరీ కూడా నిర్బంధించబడివనారిలో ఉండడం విశేషం.
గోపీబల్లభ్ పూర్ లోని 'నయబాసన్ జనకళ్యాణ్ విద్యాపీఠ్' అనే పాఠశాలలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల మేనేజింగ్ కమిటీ కార్యదర్శి అశోక్ పట్నాయక్ సంఘటన గురించి చెప్పినట్లు 'ది హిందూ' పత్రిక తెలిపింది. ఫెయిలయినవారందరినీ పన్నెండో తరగతికి ప్రమోట్ చేస్తే తప్ప తాళాలు తెరవబోమని విద్యార్ధులు తెగేసి చెప్పారని పట్నాయక్ ని ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది.
క్లాస్ XI లో మొత్తం 247 మంది విద్యార్ధులు ఉంటే అందులో 90 మంది ఫెయిలయ్యారు. 'వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్' క్లాస్ XI విద్యార్ధులకి పరీక్షలు నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు కౌన్సిల్ రూపొందించినప్పటికీ సమాధానాలను మాత్రం స్కూల్ టీచర్లే వాల్యుయేషన్ చేశారు. ఫలితాలని ఈ నెలాఖరుకి వెల్లడిస్తారని 'ది హిందూ' తెలిపింది. ఫలితాలు వెల్లడి కాకుండానే తాము ఫెయిలయినట్లు విద్యార్ధులకి ఎలా తెలిసిందీ వివరం లేదు.
కౌన్సిల్ నిబంధనల వలన ఈ విషయంలో తామేమీ చేయలేకపోతున్నామని సెక్రటరీ పట్నాయక్ తెలిపాడు. సెక్రటరీ తో సహా స్కూల్ అధికారులతో ఉదయం 9 గంటలకి చర్చలు జరిగినా అవి విఫలం అయ్యాయని తెలుస్తోంది. పాఠశాల ముగిసిన 10.30 గంటలవరకూ సమస్య పరిష్కారం కాలేదని ది హిందూ తెలిపింది. ఇతర క్లాసుల విద్యార్ధులందరూ ఇళ్లకు వెళ్లిపోగా తొంభై మంది విద్యార్ధులు పాఠశాల సిబ్బంది 52 మందీ లోపల ఉండగా గేటుకి తాళాలు వేశారు. బోధనేతర సిబ్బంది కూడా లోపలే ఉన్నారని తెలుస్తోంది.
తమకు సమాచారం అందినప్పటికీ విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉండడంతో జోక్య చేసుకోలేకపోతున్నామని స్ధానిక పోలీసులు తెలిపారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam