ఏటీఎంలో డబ్బు వచ్చేదెలా?
ఏటీఎం (ATM) అంటే Automated Teller Machine లేదా Automatic Teller Machine. ఖాతాదారులు ఈ యంత్రం ద్వారా డబ్బులు తీసుకోడానికి వీలుగా బ్యాంకులు ఏటీఎం కార్డును ఇస్తాయనేది తెలిసిందే. ఆ కార్డుపై ఉండే అయస్కాంతపు బద్దీ (్చ్ఛ్టజీఛి ఖ్టిటజీఞ) లో ఖాతాదారుని వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఏటీఎం యంత్రంలోని స్లాట్‌లో జొప్పించగానే అందులోనిPIN (Personal Identification Number) బ్యాంకులోని ఖాతాకు అనుసంధాన మవుతుంది. ఖాతాదారునికి మాత్రమే తెలిసిన ఆ నెంబర్‌ను మీటల ద్వారా నొక్కితేనే తదుపరి లావాదేవీలు జరిపేలా రక్షణ ఏర్పాటు ఉంటుంది.
సరైన ఖాతాదారు తనకు కావాల్సిన డబ్బు ఎంతో సూచించగానే ఆ సంకేతాలు బ్యాంక్‌లో ఉండే కేంద్రీయ (Central) కంప్యూటర్‌కి అందుతాయి. అది ఆ ఖాతాలో బ్యాలన్స్‌ను సరిచూసి తిరిగి ఏటీఎంకు సంకేతాన్నిస్తుంది. వెంటనే ఏటీఎంలో యంత్రవిభాగాలు స్పందించి నోట్లను లెక్కిస్తాయి. కేంద్రీయ కంప్యూటర్‌తో అనుసంధానమై ఉండే పరారుణ స్పర్శీయ సాధనం (Infrared Sensing Device) ఆ డబ్బు సరైన మొత్తంలో ఉందో లేదో గమనిస్తుంది. పొరపాటు ఉంటే 'రిజెక్ట్ బాక్స్'కి పంపిస్తుంది. సరిగా ఉంటే కరెన్సీ నోట్లు ఏటీఎంలోని డెలివరీ స్లాట్‌కు రోలర్ల సాయంతో చేరుకుని నెమ్మదిగా విడుదల అవుతాయి. ఆపై అతడు జరిపిన లావాదేవీ వివరాలను తెలిపే స్లిప్ కూడా బయటకి వస్తుంది. ఆపై ఏటీఎం ద్వారా బ్యాంకుకు సంకేతం అందగానే అక్కడి కేంద్రీయ కంప్యూటర్ ఎకౌంట్‌ను అప్‌డేట్ చేస్తుంది. ఎప్పుడైనా డబ్బు తీసుకునే అవకాశం ఉండడంతో కొందరీ యంత్రాన్ని సరదాగా Any Time Money కూడా అంటారు. పిల్లలూ ఈసారి మీ డాడీతో ఏటీఎం కి వెళ్లినప్పుడు పైవన్నీ గమనించడం మరిచిపోకండి!