క్యాంపస్ ఇంటర్వ్యూల్లో గెలుపు సూత్రాలు

campus-interviewsప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో జాబ్ సాధించడం ఒక కల. అది నిజం చేసుకోవడం అంత సులభం కాదు. దీనికి సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు మరికొన్ని నైపుణ్యాలను కూడా అలవర్చుకోవలసి ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు తోడ్పడే కొన్ని విజయ సూత్రాలను ఇక్కడ అందిస్తున్నాం.

ఇంజినీరింగ్ చదువు పూర్తి కాకముందే.. కొలువు దక్కించుకునే అవకాశం జాబ్ మేళాలు కల్పిస్తున్నాయి. మూడో ఏడాదిలో ఉన్నప్పుడే సాధారణంగా సంస్థలు కళాశాలలకు వచ్చి అర్హులను ఎంపిక చేసుకుంటాయి.అయితే మూడో ఏడాది కదా... అప్పుడు సిద్ధం అవుదాం అనుకుంటే మాత్రం సమయం సరిపోదు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రిపరేషన్ నిరంతర ప్రక్రియలాగా కొనసాగాలి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ లో ముఖ్యం గా నాలుగు దశలు ఉంటాయి. అవి 
1) రాత పరీక్ష 
2) టెక్నికల్ ఇంటర్వ్యూ
3) గ్రూప్ డిస్కషన్ 
4) హెచ్ ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ
ప్రతి దశలోనూ కొంత మంది విద్యార్థులు తొలగిపోతూ ఉంటారు. దీంతో క్రమంగా పోటీ పడుతున్న వారి సంఖ్య తగ్గినా... పోటీలో తీవ్రత మాత్రం అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు రాత పరీక్షకు 100 మంది హాజరు అయ్యారని భావిస్తే అందులో 50 మంది రెండో రౌండ్‌కు వెళ్లారనుకుంటే... ఆ 50 మందికి ఇంచుమించు సమాన స్థాయిలో తెలివి తేటలు ఉంటాయి. అంటే పోటీ పడుతున్న అభ్యర్థులు తగ్గినా... తీవ్రత అలా పెరుగుతూ ఉంటుంది. అందుకే సామర్ధ్యం అత్యుత్తమ స్థాయిలో ఉండాలి.
ఇప్పటికే చాలా కళాశాలల్లో ప్లేస్‌మెంట్లు కొనసాగుతున్నాయి. ఇవి డిసెంబర్ వరకూ కొనసాగే అవకాశం కూడా ఉంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు మాత్రమే కాకుండా పత్రికా ప్రకటనలు లేదా ఇతరేతర పద్దతుల ద్వారా అయినా ఎంపిక విధానం దాదాపుగా ఇదే రీతిన ఉంటుంది.

రాత పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్ విభాగాలు ఉంటాయి. నిజానికి ఇంగ్లీష్, అర్థమెటిక్ అంశాలు పాఠశాల స్థాయిలో చదువుకున్నవే. రీజనింగ్ అకడమిక్ అంశాల్లో భాగం కాకపోయినా ఏదో విధంగా అందరికీ ఈ అంశం పరిచయం ఉన్నదే అయి ఉంటుంది. 

ఇందులో ఫార్మూలాలు నేర్చుకోవడం, వాటిని అనువర్తించడం కాకుండా తార్కికంగా ఆలోచిస్తూ సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. ఇలా తార్కిక ఆలోచన చేయడం పెద్ద కష్టం కాదు. ఇంజినీరింగ్ అకడమిక్ అంశాలు చదివి.. వాటిని పుస్తకాల్లో ఉన్నవి ఉన్నట్టుగా నేర్చుకున్న వారికి ఇవి ఇబ్బందిగా ఉంటాయి. పుస్తకాల్లోని అంశాలను విభిన్న అంశాలకు అన్వయించగలగాలి. అలా చేసిన వాళ్లకు అర్థమెటిక్, రీజనింగ్ సబ్జెక్టులు పెద్ద కష్టంగా ఉండవు. 

ఇంటర్నెట్‌లో తగినంత మెటీరియల్ అందు బాటులో ఉంటుంది. అలాగే వివిధ పబ్లికేషన్లు కూడా రీజనింగ్, అర్థమెటిక్‌లపైన పలు పుస్తకాలను ప్రచురించాయి. వాటిని పరిశీలించ డంతో పాటు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలకు కనీసం మూడు నెలల పాటు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. 

రాత పరీక్ష
రాత పరీక్ష స్థాయిలో కీలకమైనది ఇంగ్లీష్. ఇంగ్లీష్ కేవలం సాధారణ గ్రామర్ నైపుణ్యాలను పరిశీలించేదిగా మాత్రమే ఉంటుంది. లోతుగా ఉండే గ్రామర్ నిబంధనలు తెలియకపోయినా.. టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వంటి కీలక విభాగాలను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంజినీరింగ్ తొలి ఏడాదిలో ఎక్కువగా ఈ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడు బాగా చదివిన వాళ్లకు ప్లేస్‌మెంట్‌లో తొలిదశలో ఉన్న రాత పరీక్షలోని ఇంగ్లీష్ గట్టెక్కడం పెద్ద కష్టం కాదు. 

టెక్నికల్ ఇంటర్వ్యూ
ఈ దశ దాటిన వారికి రెండవదిగా టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఇందులో ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

ఇంజినీరింగ్‌లో తొలి రెండేళ్లలో ఎక్కువగా బేసిక్ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. మూడు, నాలుగు సంవత్సరాలలో ఆయా అంశాల అనువర్తనానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. టెక్నికల్ రౌండ్‌లో సాధారణంగా తొలి రెండేళ్ల పాటు చదివిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. దీనికి కారణం బేసిక్ అంశాల్లో పట్టు ఉన్న వాళ్లు అనువర్తనం బాగా చేయగలుగుతారని సంస్థలు తొలి రెండేళ్ల సిలబస్‌కు ప్రాధాన్యం ఇస్తాయి. పని చేసే చోట కూడా ఈ అంశాలకు సంబంధించిన అనువర్తనాల విధులే ఉంటాయి. అందుకే తొలి రెండేళ్ల సిలబస్ విద్యార్థులు బాగా చదవాల్సి ఉంటుంది. అంటే మూడో ఏడాది చివర జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూకు తొలి ఏడాది నుంచే సిద్ధం కావాలన్నమాట. లేదంటే పరీక్షల్లోనే కాదు, ఉద్యోగ వేటలోనూ వెనక బడినట్లే. 

గ్రూప్ డిస్కషన్
ఇక మూడో దశ గ్రూప్ డిస్కషన్. ఇందులో విద్యార్థి చొరవ, మాటల్లో స్పష్టత, భావ వ్యక్తీకరణ, ఎంత తక్కువ పదాల్లో ఎంత ఎక్కువ సమాచారం ఇవ్వగలుగుతున్నాడు.. తన భావాలను త్వరగా మార్చుకునే స్వభావం ఉందా.. వంటి అంశాలను పరిశీలిస్తారు. 

కొంత మంది ఇంగ్లీష్‌లో గడగడ మాట్లాడితే సరిపోతుంది అనుకుంటారు. ఈ రౌండ్ ఉద్దేశం.. భాష ఏ మాత్రం కాదు. అభ్యర్థుల విశ్లేషణ శక్తి, వాటిని వ్యక్తం చేయగలగడంలో ఉన్న నేర్పు. నిత్యం దినపత్రికలు చదవడం ద్వారా విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. విద్యార్థులు రాజకీయ, ఆర్థిక, సాంకేతిక అంశాలపైన కొంత పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు ఆయా అంశాల పట్ల తమవైన సొంత అభిప్రాయాలను ఏర్పాటు చేసుకోవాలి. అవి ఎందుకు సరైనవో, ఇతరేతర వాదనలు ఎందుకు సరికావో కూడా తెలుసు కోవాలి. ఉదాహరణకు రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులు అనుమతించారు. దీనిపై గ్రూప్ డిస్కషన్ చేయమని సంస్థలు అడగవచ్చు. దీనిపైన అభ్యర్థులు తమ వాదనలు వినిపించాలి. తాము ఏ కోణంలో అయితే వాదనలు ప్రారంభిం చారో, చివరి వరకూ దానికే కట్టుబడి ఉండాలి. అలాగని వేరేవాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడడం సరికాదు. తమ భావాలను సూటిగా స్పష్టంగా చెప్తూ పదునైన ఉదాహరణలు వినిపించాలి.

టెక్నికల్ రౌండ్‌కు సంబంధించిన అంశాలైతే ఇంజినీరింగ్ పుస్తకాల్లో దొరుకుతాయి. కాని ఇలాంటి అంశాలను కేవలం దినపత్రికల ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవి ప్రతి ఏడు మారుతూ ఉండొచ్చు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఎఫ్‌డీఐలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నందున ఆ అంశాన్నే అడగవచ్చు. వచ్చే ఏడు మరో అంశం తెరపైకి రావచ్చు. కాబట్టి విభిన్న అంశాల పట్ల అవగాహన ఏర్పర్చుకోవాలి. ఒబమా రెండో సారి ఎన్నికవడం భారత ఐటీ రంగానికి మంచా లేక చెడా... ఇలా విభిన్న కోణాలు స్పృశిస్తూ ప్రిపరేషన్ కొనసాగాలి. మిత్ర బృందంతో చర్చిం చడం కూడా మంచిదే. అయిదు లేదా ఆరుగురు కూర్చొని వివిధ అంశాలపై చర్చిస్తే అటు ఇంగ్లీష్, ఇటు అంశాలపై అవగాహన కూడా పెరుగుతంది. 

హెచ్.ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ
ఇక నాలుగో దశ హెచ్ ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ. ఇందులో ఎక్కువగా విద్యార్థుల వ్యక్తిగత వివరాలపైన దృష్టి సారిస్తారు. విద్యార్థులు నిజాలను మాత్రమే చెప్పాలి. హాబీలు లేదా ఇతరేతర విషయాల్లో చాలా మంది అభ్యర్థులు లేనిపోనివి చెప్పి చిక్కుల్లో పడతారు. అభ్యర్థుల పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉన్నా... అంతకన్నా ముఖ్యమైన నిజాయతీ, నిబద్ధతలను ఇందులో పరీక్షిస్తారు. 

తప్పక చేయాల్సినవి...
sureshkumar1) సంస్థలకు సంబంధించిన కార్యాకలాపాలు, వాటి వివరాలు, ఇతర ప్రత్యేక అంశాలు తెలుసుకోవాలి. ఇంటర్నెట్, వార్తపత్రికల ద్వారా వీటిని సేకరించుకోవచ్చు.
2) విభిన్న అంశాలపై స్పష్టమైన భావాలను ఏర్పర్చుకోవాలి. భావాలను పుస్తకాల నుంచి సేకరించరాదు
3) ఇంజినీరింగ్ అంశాలకు సంబంధించి ప్రామా ణిక పుస్తకాలపై ఆధారపడడమే మేలు
4) గ్రూప్ డిస్కషన్‌లో ఇతరుల భావాలను తీవ్ర పదజాలంతో ఖండించరాదు. సున్నితమైన మాటలతో మన భావాలు ఎంత వరకు సరైనవో మాత్రమే వివరించాలి.
5) ఇంటర్వ్యూల్లో హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న అందరికీ విష్ చేయాలి. సాధారణంగా ప్రశ్న వేసిన వారివైపే చూస్తూ సమాధానం మొత్తం చెప్పకూడదు. అడిగిన వారివైపే కాకుండా అందరిని చూస్తూ సమాధానాలు చెప్పాలి.
6) ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అభ్యర్థికి భిన్నమైన వాదన వినిపిస్తే అంగీకరించాల్సిన అవసరం లేదు. అయితే తమ భావాలు ఎంతవరకు సమంజసమైనవో ఉదాహర ణలతో వివరిస్తూ వాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి.

- వ్యాసకర్త ః ప్లేస్‌మెంట్ ఆఫీసర్, 
జె.ఎన్.టి.యు, హైదరాబాద్.


camp-i

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®