తెలంగాణ చరిత్ర తెలుసుకుందాం !

చరిత్ర జ్ఞానం లేని వాడు చరిత్ర హీనుడవుతాడు. అందుకే అందరికీ చారిత్రకాధ్యాయనం అవసరం. 

పదిహేను కోట్ల మంది తెలుగువారి చేత రెండువేల ఏండ్ల చరిత్ర గల తెలంగాణా సంస్కృతిని తప్పనిసరిగా నేర్పేటట్లు విద్యాశాఖామాత్యులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రపంచానికి బృహత్కథను అందించిన పైశాచీ ప్రాకృత మహాకవి గుణాఢ్యుడు కరీంనగర్‌ జిల్లాకు చెందినవాడు. శ్రీకృష్ణుని భార్య రుక్మిణీ దేవి కూడా ఉత్తర తెలంగాణాకు చెందిన మహనీయురాలు. శాతవాహనుల రాజధానులలో కరీంనగర్‌ ప్రాంతం కూడా ఉన్నట్లు కొందరి అభిప్రాయం. తెలివాహపై కొన్ని పరిశోధనలు జరిగాయి. ఆ విషయం మరీ విస్తరించటం లేదు. గాథాసప్తశతిలోని చాలా శర్లకాలు గోదావరి తీర ప్రాంతంలోనే పుట్టాయి. ఆంధ్రప్రదేశ్‌కు త్రిలింగదేశం అనిపిలిచేవారు. అందులో ఒక సరిహద్దు కరీంనగర్‌ జిల్లాలో ఉంది. ఇవన్నీ చారిత్రక సత్యాలే. మార్కోపోలో భారతదేశ పర్యటన చేస్తూ వరంగల్లు వచ్చారు. అప్పుడు రుద్రమదేవి పరిపాలిస్తున్నది. ఈమె రాజ్యంలో రత్నాలు, వజ్రాలు వీధులలో కుప్పలు పోసి అమ్ముతున్నారని వర్ణించారు. ఐతే అంతటి వైభవం కూడా రెండవ ప్రతాప రుద్రునితో అంతరించింది. అందుకు కారణం మాలిక్‌ కాఫర్‌ పరాక్రమంతో బాటు తెలంగాణాలోని అంత: కలహాలు. గోనగన్నారెడ్డి వంటి వీరులను కాకతీయులు ఆదరించారు. రెడ్లకు ప్రాధాన్యత నీయటం వెలమ దొరలకు నచ్చలేదు. అందువల్ల వారు మాలిక్‌ కాఫర్‌తో కాకతీయులు చేసిన యుద్ధంలో సహకారం అందించలేదు. ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. 

ఆ తర్వాత కాపీయ నాయకుడు ప్రోలయ నాయకుడు అనే ఇద్దరు కమ్మ ప్రభువులు తిరిగి తెలంగాణాను శత్రువుల నుండి విముక్తం చేసి కాకతీయ సామ్రాజ్యలక్ష్మికి తిరిగి మామిడాకు తోరణాలు కట్టారు. ఐతే తెలంగాణా తిరిగి ఏడు వందల సంవత్సరాలు ముస్లిముల చేతనే పరిపాలింపబడింది. బానిసను దొరా -నీ కాళ్లకు మొక్కుతా -అని అట్టడుగు వర్గాలకు చెందిన సామాన్యులను ఈ ప్రభువులు బానిసతనాన్ని నేర్పారు. రాచకొండకు చెందిన సర్వజ్ఞ సింగభూపాలుడు పోతనగారు రచించిన భాగవతాన్ని చెరబట్టాడు. ఫలితంగా నేటికీ పోతన భాగవతంలో చాలా అధ్యాయాలు మనకు దొరకటం లేదు. ఈ దొరగారి కథ తెలుగువారందరికీ తెలుసు.

పాల్కురికి సోమనాథుడు వీరశైవుడు. తెలంగాణా తురుష్కమయం కాబోతున్నది అని తెలిసి కర్నాటకకు వెళ్లి కల్వ అనే ప్రాంతంలో పరమపదించాడు. ఇప్పుడు కన్నడిగులు పాల్కురికి సోమనాధుడు, బసవేశ్వరుడు మావాళ్లు అని చెప్పుకుంటున్నారు. ఇది నిజం కాదు, పాల్కురికి సోమనాథుడు తెలంగాణా ప్రాంతంవారు. బసవేశ్వరుని పూర్వీకులు గుంటూరు జిల్లాకు చెందినవారు.

అసఫ్‌ జాహీలు కళాప్రియులు. ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించారు. హైదరాబాద్‌ -నగరం ముస్లింలు ముస్లింల కోసం నిర్మించుకున్నారు. మాసాబ్‌టాంక్‌ (అంటే రాణీగారు త్రవ్వించిన చెరువు). రాణిగంజ్‌, అంటే రాణీగారి ప్రదేశం, బీగం బజార్‌ వంటివి ముస్లిం రాణుల షాపింగ్‌ ప్రాంతాలు. చూడీబజార్‌ అంటే గాజులు అమ్మే ప్రాంతం. కోఠీ అంటే ఇంగ్లీషు దొరగారి నివాసస్థానం. తెలంగాణాలో దేవాలయాలు చాలా అధ్వాన్నదశలో ఉండేవి. తెలుగు మాట్లాడితే తప్పు. రామాయణ, భారత నాటకాలు ప్రదర్శిస్తే అరెస్టు చేసేవారు. రోషనారా నాటకాన్ని నిషేధించారు. ఈ వివరాలేవీ ఈతరం వారికి తెలియవు. 1947 లో రజాకార్లు స్థానిక హిందువులను చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు ప్రాణరక్షణకై బాపట్ల, పందిళ్లపల్లి, విజయవాడ వంటి ప్రాంతాలకు వలసపోయారు. నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌, కాశింరజ్వీల ఈ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని కెసిఆర్‌ కోరటం నిజంగా సంతోషింపదగ్గ విషయం. ప్రజలకు తప్పనిసరిగా చారిత్రక జ్ఞానం ఉండాలి. మా పూర్వీకులకు కాకతీయ మహారుద్ర దేవరాజు ముదిగొండ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. అది దేవరకొండ (నల్గొండ) జిల్లాలో నేటికీ ఉంది. ఐతే మాలిక్‌ కాఫర్‌ దండయాత్రల తర్వాత ఇక్కడి నంది విగ్రహాల మూతులు పగలగొట్టారు. ఆలయాలు నేలమట్టమైనాయి. అబుల్‌ హసన్‌ తానీషా వంటి మతసహనం గల కొందరు రాజులు భద్రాద్రి రామునికి తర్వాతి కాలంలో కైంకర్యం చేయించినట్లు, కూచిపూడి నర్తకులకు అగ్రహారాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. స్థానికంగా షియా -సున్నీ శాఖల మధ్య అంత:కలహాలు ఉండేవి. కాకతీయుల కాలంలో తెలంగాణ సరిహద్దులు కాంచీపురం (తమిళనాడు) వరకు వ్యాపించాయి. ముస్లిం పాలకులకు గుంటూరు, కర్నూలు ప్రాంతాలవారు గోల్కొండ వచ్చి కప్పం కట్టిపోయేవారు. స్థానిక పటేల్‌, పట్వారీలు, దొరలు సాగించిన పరిపాలనా వైభవం తెలుసుకోవాలంటే దాశరథి రంగాచార్య గారి చిల్లర దేవుళ్లు జనపదం చదవండి -రజాకార్ల చరిత్ర తెలుసుకోవాలంటే వందేమాతరం వీరభద్రరావు, రామచంద్రరావు గార్ల గ్రంథాలు అధ్యయనం చేయండి. ఇంకా ఆదిరాజు వీరభద్రరావు, బి.ఎన్‌.రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి గార్ల గ్రంథాలూ పాఠ్యాంశాలుగా పెట్టాలి. ఈ చిన్న వ్యాసాన్ని విద్యార్థులు రాజకీయ నాయకులూ అందరూ అధ్యయనం చేయండి. ''మా నిజాము రాజు తరతరాల బూజు'' అన్న దాశరథి కృష్ణమాచార్యుల వారి అగ్నిధార, రుద్రవీణ పాఠ్య గ్రంథాలుగా పెట్టండి. ఎందుకంటే ఇవి చారిత్రక పరిశోధనా విషయాలను తెలియజేస్తాయి. నేటి ప్రత్యేక తెలంగాణా సమైక్యాంధ్ర ఉద్యమాలలో ఈ వ్యాసానికి ఎట్టి సంబంధమూ లేదు. వానమామలై వరదాచార్యులవారు రచించిన మేఘవలయము తెలంగాణా ప్రాంతం వారే కాక మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా పెట్టించండి. తెలంగాణా శబ్దం త్రిలింగ శబ్దోద్భవం. కాకతీయులను త్రిలింగ దేశాధిపతులు అని పిలిచేవారు. ఈ త్రిలింగములలో ఒకటి కరీంనగర్‌ జిల్లాలోను, రెండవది తూర్పు గోదావరి జిల్లాలోను, మూడవది కర్నూలు జిల్లాలోను ఉన్నాయి. కాకతీయులు మొదట జైనులు తర్వాత శైవులు. ప్రతాపరుద్ర యశోభూషణము రచించిన విద్యానాథుడు అప్పకవీయము (ఛందోగ్రంథము) రచించిన అప్పకవి తెలంగాణా ప్రాంతంవారే. తెలగాణ్యులు, గోల్కొండ వ్యాపారులు అనే శాఖలు నేటికీ బ్రాహ్మణులలో ఉన్నాయి.

నిజాం కాలేజీని రాజుగారు తమ కోసం, రాజోద్యోగుల బిడ్డలకోసం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగరం 3 లక్షల మంది కోసం ప్లాన్‌ చేయబడింది. 200 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఏనుగుల వీరాస్వామిగారి ''కాశీయాత్ర'' చదవండి. ఆ రోజుల్లో వనపర్తి, దోమకొండ, గద్వాల వంటి సంస్థానాలుండేవి. వారు ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకున్నారు. వారి కళాసాంస్కృతిక సేవ కూడా గణనీయమైనదే. చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. అందువల్ల ఉస్మాన్‌ ఆలీఖాన్‌, కాశింరజ్వీ, షాబుల్లాఖాన్‌, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పాల్కురికి సోమనాథుడు, అబుల్‌ హసన్‌ తానీషా, కంచెర్ల గోపన్న, కులీకుతుబ్‌షా, చెర్విరాల నాగయ్య, కొమరం భీం వంటి వారిపై పాఠ్యాంశాలు పెట్టాలి.

మంచి -చెడూ అన్నీ చారిత్రక ప్రామాణ్యాలతో పాఠకులకు పరిశోధక విద్యార్థులను అందించాలి. 1830లో ఏనుగుల వీరాస్వామి అనే మద్రాసు వాసి ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి కాశీవెళ్తూ హైదరాబాద్‌ వచ్చాడు. అంటే నేటికీ 200 సంవత్సరాల నాటి గోల్కొండ రాజుల పాలన ఎలా ఉండేదో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పీర్లపండుగ వైభవంగా జరిగినట్లు వర్ణించాడు. హిందువులు ఇవ్వాళ హైదరాబాద్‌లో గణశ్‌ ఉత్సవాలు దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో జరుపుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో హిందువులు పండుగలను రహస్యంగా నేలమాళిగ (అండర్‌ గ్రౌండ్‌)లలో గణశ, హనుమాన్‌ విగ్రహాలు పెట్టి జరుపుకునేవారు. నేటికీ పాతబస్తీలో కొన్ని దేవాలయాలు భూగర్భంలో ఉండటం గమనార్హం. ఇదీ ఆనాటి తెలంగాణా.

--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®