ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63 వ అధికరణంలో ఉప రాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉన్నది. ఈ పదవికి సంబంధించి భారత్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉన్నది. అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, అమెరికాలో అధ్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) కనుక, ఉప రాష్ట్రపతి విధులకు, అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.
ఉప రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది సందర్భాలలో పదవీకాలం ముందే ముగియవచ్చు.
ఉప రాష్ట్రప్తి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపినపుడు
రాజ్యసభ తీర్మానం ద్వారా ఉప రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినపుడు
అయితే ఉప రాష్ట్రపతి ఐదేళ్ళ కాలం ముగిసినా, తన వారసుడు పదవి చేపట్టే వరకు పదవిలో కొనసాగుతారు.
ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసే లోపు తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి అయిపోవాలి. ఒకవేళ ఉప రాష్ట్రపతి పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే (మరణం, రాజీనామా, తొలగింపు మొదలైన వాటి వలన) తదుపరి ఉప రాష్ట్రపతి కొరకు ఎన్నిక వీలయినంత త్వరగా జరగాలి. అప్పుడు ఎన్నికయ్యే వ్యక్తి ఐదేళ్ళ పూర్తి కాలం అధికారంలో ఉంటారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam